క్యాన్సర్‌పై విజయం స్క్రీనింగ్ పరీక్షలతోనే సాధ్యం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్క రూ అవగాహన కలిగి ఉండడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శా ఖ కమిషనర్ వీరపాండ్యన్ అన్నారు. క్రమం తప్పక స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వ్యాధి నియంత్రణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సమాజంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలతో పాటు జీవన శైలిలో మార్పుల వలన అసంక్రమిత వ్యాధుల నమోదు సంఖ్య నానాటికి పెరుగుతోందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఏడాది క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని తొలి దశలోనే వ్యాధిని గుర్తించగలిగితే చికిత్స ద్వారా వ్యాధిని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం క్యాన్సర్ వ్యాధి చికిత్సలను ఉచితంగా అందిస్తోందని, ప్రజలు ముందుకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా చైతన్యవంతులుగా చేయాలని సూచించారు.
వ్యాయామంతో కాన్సర్ దూరం..
కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ జంక్ ఫుడ్స్ చక్కెర, ఉప్పు కొవ్వు పదార్థాలు అధిక క్యాలరీస్ వివిధ హర్మోన్లుపై ప్రభావం చూపి క్యాన్సర్ వ్యాధికి కారణమైయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. రోజూ వాకింగ్, రన్నింగ్, సైకిలింగ్, యోగా వంటివి ఆచరిస్తే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చన్నారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ కె.శ్యామల, డబ్య్లుహెచ్‌వీ కన్సల్టెంట్ డాక్టర్ జి.సురేష్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, ఎన్సీడీ నోడల్ అధికారి డా. మాధవి తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్


