వందేమాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): స్వాతంత్య్ర ఉద్యమంలో విద్వాంసుల నుంచి విప్లవకారుల వరకు వందేమాతం గేయం కదిలించిందని ఆ స్ఫూర్తితోనే వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, కేబీఎన్ కళాశాల ఆధ్వర్యంలో ఆ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రత్యేక వేడుకలు జరిగాయి. అందులో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు యలమంచిలి సుజనా చౌదరి, రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్మన్ తేజస్వి పొడపాటి, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తదితరులు కలిసి భరతమాత చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించారు. వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దాదాపు మూడువేల మంది విద్యార్థులతో వందేమాతరం గేయాలాపన చేశారు. ప్రధానమంత్రి సందేశాన్ని వర్చువల్‌గా వీక్షించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాసు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఎండలో అల్లాడిన విద్యార్థులు...
వందేమాతరం గేయ ఆలాపన కోసం వేలాది మంది విద్యార్థులను ఎండలో నిలబెట్టడంతో వారంతా అల్లాడిపోయారు. ఉదయం 9.30 నుంచి 11.00 గంటల వరకూ సుమారు గంటన్నర పాటు ఎండలో నిలబడటంతో గేయాలాపన పూర్తవగానే విద్యార్థులు అక్కడి నుంచి నీడలోకి వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణం ఖాళీ అయింది. విద్యార్థులు పక్కకు వెళ్లిపోవటంతో వచ్చిన అతిథులు ప్రసంగించకుండానే వెనుతిరిగారు. ప్రాంగణంలో ఎటువంటి టెంట్ వేయకపోవటం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర అసహనానికి గురయ్యారు. కనీసం మంచినీరు సైతం తొలుత అందుబాటలో ఉంచలేదు. గంటన్నర తరువాత తాగునీటిని పంపిణీ చేశారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్


