వీఎంసీ మొబైల్ కోర్టులో కేసుల విచారణ
పటమట(విజయవాడతూర్పు): రోడ్లపై రాకపోకలకు అవరోధం కలిగేలా జంతువులను వదిలినా, డ్రైయిన్లలో మురుగునీటి పారుదలకు అడ్డంకి ఏర్పడేలా చెత్త, వ్యర్థాలు వేసినా వీఎంసీ మొబైల్ కోర్డుకు హాజరు కావాల్సిందేనని వీఎంసీ మొబైల్ కోర్టు, 8వ మెట్రోపాలిటిన్ అదనపు జ్యుడీషియల్ న్యాయమూర్తి గోలి లెనిన్‌బాబు హచ్చరించారు. వీఎంసీ ప్రజారోగ్య విభాగం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నమోదు చేసిన కేసులను ఆయన శుక్రవారం విచారించారు. పటమటలోని సర్కిల్–3 కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ఈ విచారణలో ఆయన మొత్తం 8 కేసులను విచారించి వారికి రూ.8350 జరిమానా విధించారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్–3 డాక్టర్ గోపాల్ నాయక్, శానిటరీ సూపర్వైజర్స్ బాలాజీ శ్రీనివాస మూర్తి, సర్కిల్ –3 పరిఽధిలోని ఆయా డివిజన్ల శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
11న యోగాసన పోటీలకు జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల యోగాసన (పురుషులు – మహిళలు) చాంపియన్‌షిప్–2025లో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యోగాసన (పురుషులు – మహిళలు) జట్ల ఎంపిక ఈ నెల 11న తమ యూనివర్శిటీ ఆవరణలో జరుగుతాయని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఈ.త్రిమూర్తి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 2025–2026 సంవత్సరానికి నిర్వహించే ఈ పోటీల్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు అనుబంధంగా ఉన్న అన్ని మెడికల్, డెంటల్, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, బిఎన్‌వైఎస్, ఫిజియోథెరపీ, బీఎస్సీ (నర్సింగ్), బీఎస్సీ, (ఎంఎల్‌టి) కాలేజీల నుంచి పాల్గొనేవారు 11వ తేదీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని తమ యూనివర్సిటీ ఆవరణలో జరిగే ఎంపికలకు హాజరు కావాల్సిందిగా కోరారు.


