పోలీస్ కమిషనరేట్‌లో సామూహిక వందేమాతర గీతాలాపన
లబ్బీపేట(విజయవాడతూర్పు): వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సామూహిక వందేమాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబుతో పాటు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి వందేమాతరాన్ని ఏకస్వరంతో ఆలపించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వందేమాతరం అనేది దేశభక్తి నినాదం మాత్రమే కాదని, అది మన మనసుల్లో దేశమంటే ఏమిటో గుర్తుచేసే శక్తి అన్నారు. భారతీయుల మనసుల్లో దేశభక్తిని మేల్కొలిపిన ఆత్మీయ నినాదమని, 1875 నవంబర్ 7న మహాకవి బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయం తొలిసారిగా ’ఆనంద్ మఠ్’ నవలలో ప్రచురితమైందన్నారు. ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగస్ఫూర్తిని నింపింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కె.జి.వి. సరిత, పలువురు ఇన్‌స్పెక్టర్‌లు, సీపీవో సిబ్బంది పాల్గొన్నారు.


