జనవరిలో ఎ.కొండూరుకు కృష్ణా జలాలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
తిరువూరు: వచ్చే ఏడాది జనవరిలో ఎ.కొండూరు మండలానికి కృష్ణానదీ జలాలు సరఫరా చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎ.కొండూరు మండలంలో గురువారం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవల పరిశీలనకు కలెక్టర్ విచ్చేశారు. కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రోగులకు మందులు, పౌష్టికాహారం సరఫరాకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. నెఫ్రాలజిస్టు వైద్య సేవలను విస్తృతం చేస్తామని, రోగులు వైద్యుల సూచనలు పాటిస్తే కిడ్నీ సమస్యల బారి నుంచి విముక్తులవుతారని కలెక్టర్ సూచించారు. తొలుత వైద్యాధికారులతో కలసి ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన కృష్ణారావుపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంకు పైకెక్కి నీటి నాణ్యతను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సేవలు పొందుతున్న కిడ్నీ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎ.కొండూరు మండలంలో 15 తండాలలో 267 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు వైద్యశాఖ సర్వేలో వెల్లడైందని, వీరిలో 26 మంది డయాలసిస్ రోగులుండగా, 241 మందికి సీకేడీ ఉన్నట్లు గుర్తించారన్నారు. ఇప్పటివరకు 41 మంది వైద్యసేవలతో కిడ్నీ వ్యాధి నుంచి విముక్తులయ్యారని కలెక్టర్ తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో ముగ్గురు కిడ్నీ బాధితులు మృతిచెందారని, జలజీవన్ మిషన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి శుద్ధి చేసిన నీరందిస్తామన్నారు. జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ఎం.సుహాసిని, తిరువూరు ఆర్డీవో మాధురి, ఆర్‌డబ్ల్యూఎస్ సూపరింటెండింగ్ ఇంజినీర్ విద్యాసాగర్, ఎ.కొండూరు తహసీల్దారు లక్ష్మి కలెక్టర్ వెంట ఉన్నారు.


