సొంత ఖర్చుతో నీటిని తోడుతున్న కాలనీ వాసులు..
అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటంతో చేసేది లేక తామే సొంతంగా ఆయిల్ ఇంజిన్ పెట్టుకుని వరద నీటిని తోడుతున్నామని నివాసితులు చెబుతున్నారు. తామంతా రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాల వారమని, అయినా రోజుల తరబడి వరద నీటిలో ఉండలేక తలా కొంత వేసుకుని ఆయిల్ ఇంజిన్ ఏర్పాటు చేసుకుని రెండు రోజులుగా వరద నీటిని బయటకు పంపుతున్నామని చెబుతున్నారు. ఆయిల్ ఇంజిన్ అద్దె, డీజిల్ కలిపి రోజుకు రూ.రెండు వేలు ఖర్చవుతోందని తెలిపారు. ఇళ్ల మధ్యకు చేరిన వరద నీటిని పూర్తిగా బయటకు పంపాలంటే మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని ఏం చేయాలో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


