జీవ ఎరువులతో భూమాతకు రక్ష
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) ప్రోత్సహించాలని, వీటిని విరివిగా వాడేలా రైతుల్ని చైతన్య పరచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి భూమాత రక్షణ కమిటీ (మదర్ ఎర్త్ ప్రొటెక్షన్ కమిటీ) సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భూమాత రక్షణ కార్యక్రమాన్ని (మదర్ ఎర్త్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం) చేపట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లా, సబ్ డివిజన్, గ్రామస్థాయిల్లో వివిధ శాఖల అధికారులతో భూమాత రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. 12వ తేదీ నాటికి కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల వారీగా, సొసైటీల వారీగా ఎరువుల వినియోగాన్ని పరిశీలించాలన్నారు. రైతులకు రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించాలని చెప్పారు.
డ్రోన్లు వాడండి..
డ్రోన్లు ఉన్న గ్రామాలలో లిక్విడ్ యూరియా/నానో యూరియా వినియోగించాలని కలెక్టర్ చెప్పారు. ఎరువులు పక్కదారి పట్టకుండా ఈ కమిటీలు చర్యలు చేపట్టాలని, గతంలో కేసులు నమోదైన గ్రామాలు, సరిహద్దు గ్రామాలలో తప్పనిసరిగా కమిటీ సభ్యులు పర్యటించాలని ఆదేశించారు. జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ సభ్యులు జెడ్పీ సీఈవో కె.కన్నమ నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, పోలీస్ అధికారి తిరుమలేశ్వర రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి త్రినాథ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రవి కిషోర్, ఏడీఏ అనిత, ఎరువుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


