జిల్లా స్థాయి యోగాసన ఎంపికలు
గన్నవరం: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17 విభాగాల్లో జిల్లా స్థాయి యోగాసన ఎంపికలు నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌కు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాల, బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ యోగ శిక్షకురాలు శిరీష పర్యవేక్షణలో ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన బాల, బాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు. నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి. నాగరాజు, యోగ శిక్షకులు కె. భూషణం, పలువురు వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


