హైవే విస్తరణలో మార్పులు అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ రహదారి–65ను విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఆరు వరుసలుగా విస్తరించే ప్రతిపాదనల్లో మార్పులు అవసరమని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు జి. లక్ష్మీశ, డీకే బాలాజీ అన్నారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఇరు జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో ఎన్‌హెచ్–65 విస్తరణ ప్రతిపాదనలపై ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులు, ఎన్‌హెచ్‌ఎఐ, మెట్రో రైల్ అధికారులతో సమావేశం జరిగింది.
● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ మాట్లాడుతూ ఎన్‌హెచ్–65 విస్తరణకు సంబంధించి మెట్రో అధికారులతో కలిసి మూడు డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుత డిజైన్‌లో బెంజ్ సర్కిల్ నుంచి చినఓగిరాల వరకు ఉన్న ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించలేదని చెప్పారు. ప్రతిపాదించిన వెహికల్ అండర్ పాస్ (వీయూసీ)లు తక్కువగా ఉన్నాయని, వీటిని పెంచే అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు.
● కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్ ఉత్తమమని పేర్కొన్నారు. విజయవాడ నగర శివారు ప్రాంతాల నుంచి ట్రాఫిక్ పెరుగుతోందని, పోర్టు ట్రాఫిక్ కూడా కలిస్తే మరింత రద్దీగా మారుతుందని, అందుకే ఎలివేటెడ్ కారిడార్‌పై దృష్టి సారించాలన్నారు. ఓఆర్‌ఆర్, మెట్రో ప్రాజెక్టులతో ఎన్‌హెచ్ 65 విస్తరణను ముడి పెట్టవద్దని సూచించారు.
● ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ఎన్‌హెచ్–65ను, ఎన్‌హెచ్–16తో అనుసంధానించాలని, దీనికై మూడుచోట్ల రహదారులు నిర్మించాలని సూచించారు.
సమావేశంలో ఇరు జిల్లాల జేసీలు ఎస్.ఇలక్కియ, ఎం.నవీన్, ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీఓ చైతన్య, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ విద్యా సాగర్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల
కలెక్టర్లు లక్ష్మీశ, బాలాజీ


