పుణ్యస్నానాలతో పులకించిన కృష్ణాతీరం
నాగాయలంక: కార్తిక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకునిఅత్యంత ప్రాశస్త్యం కలిగిన కృష్ణాతీరంలోని శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. సముద్రపు బ్యాక్ వాటర్‌తో సాగర సంగమ విశిష్టత కలిగి ఉండటం, ఇక్కడ కృష్ణానది చెంతనే భారీ వాయుప్రతిష్ట శివలింగం భక్తులకు అందుబాటులో ఉన్నందున స్వీయ అభిషేకాలకు భక్త జనం బారులు తీరడంతో కోలాహలం నెలకొంది. నది ఒడ్డున ఉన్న మండపంలో రామలింగేశ్వరస్వామి శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేశారు. నాగాయలంక, కోడూరు మండలాల నుంచి పలు గ్రామాల భక్తులు, అయ్యప్ప స్వాములు వచ్చి కార్తిక పుణ్య స్నానాలు చేసారు. స్నానాల తదుపరి భక్తులు నది ఒడ్డున ఘాట్‌లో ప్రమిదల్లో కార్తిక వత్తులు వెలిగించుకుని పెద్దల ఆశీర్వచనాలు పొందారు. గజ ఈతగాళ్ళ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది భక్తులకు సేవలందించారు. క్షేత్రం చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, ఉప్పల బుజ్జి, తలశిల రఘుశేఖర్, కనిగంటి నారాయణ పర్యవేక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరిస్తూ స్థానిక ఎస్‌ఐ కె.రాజేష్ నది ఒడ్డున ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టించారు.
దుర్గాఘాట్‌లో కార్తిక పౌర్ణమి పుణ్యస్నానాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని దుర్గాఘాట్‌లో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన పుణ్యస్నానాలు ఉదయం పదిగంటల వరకు కొనసాగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో లోపలకు ఎవరు దిగి స్నానాలు చేయకుండా ఐరన్ మెష్ ఏర్పాటు చేశారు. ఇక స్నానఘాట్‌లోని మూడు ప్రదేశాల్లో పెద్ద ఎత్తున షవర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మహిళలు అరటి డొప్పలలో నేతి దీపాలను వెలిగించారు. హైవేపై కేశఖండనశాల ఎదురు మెట్ల మార్గం ద్వారా స్నానఘాట్‌లోకి ప్రవేశించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘాట్‌లో దేవస్థానం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి నిరంతరం మైక్ ద్వారా ప్రచారం చేయడంతో పాటు వన్‌టౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
పుణ్యస్నానాలతో పులకించిన కృష్ణాతీరం


