పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చాలని పార్లమెంట్ సభ్యుఢు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మంగళవారం కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు, ఎం.డి ఎస్.భరణితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విద్యాధరపురం స్టేడియం, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో క్రీడా ప్రాంగణాలని జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ విజయవాడ క్రీడా ప్రాంగణాలన్నీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ జరిగితే విజయవాడ ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. డిసెంబర్‌లో జరగనున్న షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు వీలుగా ఇండోర్ స్టేడియంలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి.చంద్రశేఖర్, ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్ పి.సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఎ.శ్రీనాథ్, శాప్ అధికారులు పాల్గొన్నారు.


