వన్ హెల్త్ అవగాహన కార్యక్రమం ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జంతువుల నుంచి సంక్రమించే వివిధ వ్యాధులను నివారించాలన్న లక్ష్యంతో ఒకే ఆరోగ్యం(వన్ హెల్త్) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఒకే ఆరోగ్యం(వన్ హెల్త్) కార్యక్రమాన్ని పోస్టర్ ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్ మూడో తేదీన వన్ హెల్త్ డేగా జరుపుకుంటారని చెప్పారు. బర్డ్ ఫ్లూ, రేబీస్ తదితర వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయని, అలాంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్య, పశుసంవర్ధక, వ్యవసాయ, పర్యావరణ, విద్యా శాఖలతో సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు, సదస్సులు, పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, జంతువుల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామన్నారు.
పర్యావరణానికి ప్రయోజనం..
జంతువుల నుంచి వ్యాధులు సంక్రమించకుండా చేపట్టవలసిన నివారణ చర్యలను కలెక్టర్ వివరించారు. పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా టీకా మందులు ఇప్పించడం, వారానికి ఒకసారి స్నానం చేయించడం, కుక్కలకు తప్పనిసరిగా నట్టాల మందులు తాగించాలన్నారు. ఎలుకలను ఇంటి పరిసరాల్లో లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, చిలుకలతో, పక్షులతో అతి సన్నిహితంగా మెలగరాదని చెప్పారు. పశువులకు టీకా మందులు వేయించడం, చనిపోయిన పశువులను సున్నపు గుంతలలో లోతుగా పాతిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మానవులకు, జంతువులకు, పర్యావరణానికి ప్రయోజనం జరుగుతుందని చెప్పారు. మానవులకు మెరుగైన ఆరోగ్యం, వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉంటుందన్నారు. జంతువులకు మెరుగైన ఉత్పాదకత, సురక్షితమైన ఆహారం, జీవవైవిద్యంతో పాటు పర్యావరణానికి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు, స్థిరమైన సహజ వనరులు, వ్యాధుల వ్యాప్తి తగ్గుదల వంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో జేసీ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఎంహెచ్‌వో సుహాసిని, డీఈవో సుబ్బారావు, డాక్టర్ సమీర తదితరులు పాల్గొన్నారు.


