నేటి నుంచి స్కూల్ గేమ్స్ సెలక్షన్స్
గూడూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా విభాగాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్–14, 17 బాలుర, బాలికల జట్ల ఎంపికలు ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ కృష్ణాజిల్లా సెక్రటరీ మత్తి అరుణ తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 4న గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో చెస్, అథ్లెటిక్స్ సెలక్షన్స్, 5న గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో యోగా సెలక్షన్స్, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్, ఖోఖో సెలక్షన్స్ జరుగుతాయన్నారు. 6న గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సాఫ్ట్‌బాల్, బేస్ బాల్ సెలక్షన్స్, 7న గూడూరు జెడ్పీ హైస్కూల్‌లో కబడ్డీ సెలక్షన్స్ నిర్వహిస్తామని అరుణ చెప్పారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 124 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే డీసీపీ ఉదయరాణి వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదులు తీసుకున్నారు. అనంతరం ఆయా ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో పాటు సిబ్బంది తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూవివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 70, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 10, కొట్లాటకు సంబంధించినవి 1, వివిధ మోసాలపై 4, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 14, దొంగతనాలపై 3, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించి 22 ఇలా మొత్తం 124 ఫిర్యాదులను డీసీపీ ఉదయరాణి స్వీకరించారు.


