కూటమి పాలనలో ఆటోడ్రైవర్‌లకు అన్యాయం
మధురానగర్(విజయవాడసెంట్రల్): సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్‌కు ఆటో డ్రైవర్ సేవ పథకం ద్వారా ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఆటో కార్మికులంతా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో పాల్గొనాలని సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సి.హెచ్ శ్రీనివాస్, సీఐటీయూ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు కె.దుర్గారావు పిలుపునిచ్చారు. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సీఐటీయూ సెంట్రల్ సిటీ 12 వ మహాసభ మంగళవారం బీఆర్టీఎస్ రోడ్డులోని నండూరి ప్రసాదరావు సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాల కారణంగా ఆటో మోటార్ రంగం పూర్తిగా దెబ్బతిని జీవనోపాధి కోల్పోతున్నారని అన్నారు. కార్మిక చట్టాలను కాపాడుకోవటానికి కార్మికులంతా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులందరికీ న్యాయం చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 21 రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆటో మోటార్ కార్మికులు ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. అనంతరం 26 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. సీఐటీయూ సెంట్రల్ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా కె.దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్.కె.దుర్గావలి, కార్యనిర్వాహక కార్యదర్శిగా డి.కోటయ్య, కోశాధికారిగా బి.విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా పి.తిరుపతయ్య, ఉపాధ్యక్షులుగా పి.గణేష్ (చిన్న), బి.కుమార్ ఎన్నికయ్యారు.


