యానాదులకు దొరకని పునరావాసం
మచిలీపట్నంటౌన్: నగరంలోని 36వ డివిజన్ రాజుపేట మగ్గాల కాలనీకి చెందిన 20 యానాది కుటుంబాల వారు తుఫాన్ నేపథ్యంలో పునరావాసం లేక ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ పెనుగాలులకు మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వారు నివసిస్తున్న గుడిసెలు దెబ్బతిని నివాసానికి ఇబ్బందిగా మారాయి. అదే ప్రాంతంలో ఓ భారీ వృక్షం నేలకూలింది. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ యానాదుల కాలనీవాసులు 36వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ మాచవరపు రాంప్రసాద్ ను సంప్రదించారు. దీంతో ఆయన వారిని డివిజన్ లోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉంచేందుకు తీసుకెళ్లారు. అయితే వారికి గది ఇచ్చేందుకు కళాశాల నిర్వాహకులు విముఖత చూపారు. తమ కళాశాలలో పునరావాస కేంద్రం లేదని మరుగుదొడ్ల సమస్య ఉందని చెప్పారు. దీంతో కార్పొరేటర్ రాంప్రసాద్ తహసీల్దార్ కు ఫోన్ చేసి పరిస్థితిని చెప్పడంతో 50వ డివిజన్ తుఫాన్ సెంటర్లో పునరావాసం ఏర్పాటు చేశామని, వారిని అక్కడకు తీసుకువెళ్లాలని చెప్పారు. వారంతా కళాశాల వరండాలోనే తలదాచుకోగా కార్పొరేటర్ రాంప్రసాద్ వారికి తాగునీరు, అల్పాహారం అందజేశారు.


