యువత నైపుణ్యాలకు పదును పెట్టాలి
సందడిగా జిల్లా యువజనోత్సవాలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యువత తమలోని నైపుణ్యాలకు పదును పెట్టాలని విజయవాడ ఆర్డీవో కె.చైతన్య అన్నారు. యువజన సర్వీసుల శాఖ, స్టెప్, క్రిషి ఆధ్వర్యంలో విజయవాడ కేబీఎన్ కళాశాలలో గురువారం జరిగిన ఎన్టీఆర్ జిల్లా యువజనోత్సవాలు సందడిగా కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన చైతన్య మాట్లాడుతూ యువత తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువజనోత్సవాలు మంచి వేదికన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో బహుమతులు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమాధికారి యు.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన వివిధ కళాశాలల విద్యార్థులు బృందగానం, నృత్యం, చిత్రలేఖనం వంటి అంశాలలో పోటీపడ్డారు. జానపద గీతాల విభాగంలో ఎం.సింధు రాజేశ్వరి బృందం మొదటి స్థానంలో నిలవగా, టి.కిరణ్ బృందం ద్వితీయ స్థానంలో నిలిచింది. జానపద నృత్యం విభాగంలో విఘ్నేష్ కార్తికేయ బృందం మొదటి బహుమతిని, కౌశిక్ బృందం రెండో బహుమతిని దక్కించుకున్నాయి. సైన్స్ మేళాలో కె.అఖిల బృందం తొలి స్థానంలో, సీహెచ్ హాసిని బృందం ద్వితీయ స్థానంలో నిలిచాయి. స్టోరీ రైటింగ్‌లో కె.బాలమణి ప్రసాద్ ప్రథమ బహుమతిని, కె.ప్రదీప్ కుమార్ ద్వితీయ బహుమతిని పొందారు. పొయెట్రీలో ఎం.శ్రీలేఖ, వి.వర్షిణి మొదటి, రెండు స్థానాలు పొందగా, చిత్రలేఖనంలో డి.సుధీక్ష, ఎం.శ్రీ వైష్ణవి, డిక్లమేషన్‌లో కె.శ్రావణి, ఎస్కే నదియా ప్రథమ ద్వితీయ బహుమతులు పొందారు. విజేతలకు ఆర్డీఓ చైతన్య జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


