కనుల పండువగా ఆదిదంపతులకు దీపోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీగంగా పార్వతీ(దుర్గ)సమేత మల్లేశ్వర స్వామి వార్లకు పలు విశేష పూజలను నిర్వహించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో సాయంత్రం ఆదిదంపతులకు దీపోత్సవ సేవను నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదిక వద్ద సహస్ర లింగార్చనను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. లింగార్చనలో భాగంగా స్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, హారతి, ప్రసాదాల పంపిణీ జరిగింది. సాయంత్రం ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. దీపోత్సవంలో భాగంగా ఆదిదంపతులకు ఊంజల్ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య 9.19 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడ ఈస్ట్‌లో 24.0, వెస్ట్‌లో 22.8, నార్త్‌లో 21.3, సెంట్రల్‌లో 21.0, ఎ.కొండూరు మండలంలో 20.8, విజయవాడ రూరల్ మండలంలో 17.5, తిరువూరులో 11.5, మైలవరంలో 6.5, కంచికచర్లలో 6.3, చందర్లపాడులో 6.3, వీరులపాడులో 6.0, నందిగామలో 5.3, ఇబ్రహీంపట్నంలో 5.3, జి.కొండూరులో 3.3, జగ్గయ్యపేటలో 2.5, పెనుగంచిప్రోలులో 1.8, వత్సవాయిలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


