సీజేఐ గవాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
గాంధీనగర్:దేశ అత్యున్నత న్యాయస్థానం సీజేఐ బీఆర్ గవాయ్‌పై దాడి దళితుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజేఐపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నో కేసులను సుమోటోగా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు సీజేఐపై దాడి కనిపించడం లేదా అని నిలదీశారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దాడికి బాధ్యులపై కేసు నమోదు చేయలేదని, ఆయన స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జి ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేస్తారా అన్నారు. దళితులు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా కుల రక్కసి వెంటాడుతూనే ఉందన్నారు. దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామన్నారు. గవాయ్ పై జరిగిన దాడి వల్ల దేశంలో ఉన్న దళితుల హృదయాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయన్నారు. దాడి విషయంలో న్యాయాన్ని కోరుతూ నవంబర్ 1 న లక్షలాది మందితో చలో హైదరాబాద్ పేరుతో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ ర్యాలీకి ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం.నాగరాజు, పేరెల్లి ఎలీషా, నరేంద్ర, డానియల్, లింగాల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
మైలవరం:మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న నిర్వహించాల్సిన జాబ్‌మేళా కార్యక్రమం ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా రద్దు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ళ రవి తెలిపారు. తిరిగి ఈ నెల 31 శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


