మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు
కృష్ణలంక(విజయవాడతూర్పు):ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్య వ్యవస్థలను కొనసాగాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గవర్నర్‌పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేవీవీ రాష్ట్ర కమిటీ ప్రచురించిన పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్యను పొందడమే కాకుండా ప్రతి కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి కూడా ఉంటుందని చెప్పారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి ప్రజలు ఉచిత వైద్య సదుపాయాలు పొందవచ్చని తెలిపారు. మెడికల్ రిప్స్ యూనియన్ నాయకుడు యు.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య హక్కులకు, పేద ప్రజల వైద్యానికి హామీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోనే సాధ్యమన్నారు. ప్రజారోగ్య వేదిక నాయకుడు రామావతారం మాట్లాడుతూ వైద్య విద్యను ఆరోగ్యాన్ని అంగడి సరుకుగా మార్చే పీపీపీ విధానాలను మానుకోవాలని కోరారు. 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పది మెడికల్ కాలేజీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు, విస్తృత ప్రచారం నిర్వహించామన్నారు. వాటిని రక్షించుకోవడం కోసం జేవీవీ చేస్తున్న కృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు


