మంత్రి అనుచరుడి ఇంట్లో పేకాట శిబిరం
కంకిపాడు: పేకాట శిబిరంపై కంకిపాడు పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. దాడుల్లో 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి రూ 1.72 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ డి.సందీప్ తెలిపిన వివరాల మేరకు...కంకిపాడు గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి అనే వ్యక్తి కొంతమంది పేకాట రాయుళ్లను కూడగట్టి కోలవెన్ను గ్రామానికి చెందిన టీడీపీ నేత, మంత్రి కొలుసు పార్థసారథి అనుచరుడు కొలుసు లక్ష్మణ్ ఉప్పులూరు గ్రామంలో అద్దెకు తీసుకున్న ఇంట్లో పేకాట కోతముక్క నిర్వహిస్తున్నాడు. పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో ఆ శిబిరంపై కంకిపాడు ఎస్‌ఐ డి.సందీప్, ఉయ్యూరు రూరల్ ఎస్‌ఐ సురేష్‌ల నేతృత్వంలో పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించారు. దాడుల్లో 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ 1.72 లక్షలు నగదు, ఒక కారు, 10 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.


