పోస్టాఫీసులో నగదు గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసులో నగదు గోల్‌మాల్‌

Oct 22 2025 6:40 AM | Updated on Oct 22 2025 6:40 AM

పోస్ట

పోస్టాఫీసులో నగదు గోల్‌మాల్‌

నా భార్య ఖాతాలో సొమ్ము మాయం సంతకం చేయించుకుని డబ్బులివ్వలేదు

కవులూరు పోస్టాఫీసులో మహిళా పోస్టుమాస్టర్‌ చేతివాటం

ఎనిమిది నెలలుగా ఖాతాదారుల సొమ్ము స్వాహాచేసిన వైనం

ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చిన స్కామ్‌

కొండపల్లి సబ్‌ పోస్టాఫీస్‌కు పరుగు పెడుతున్న ఖాతాదారులు

జి.కొండూరు: ఖాతాదారుల నగదును మహిళా పోస్టుమాస్టర్‌ స్వాహాచేసిన ఘటన మండలంలోని కవులూరు బ్రాంచ్‌ పోస్టాఫీసులో వెలుగు చూసింది. ఎనిమిది నెలలపాటు గుట్టుగా సాగిన స్వాహా పర్వం ఉన్నతాధికారుల సాధారణ తనిఖీల్లో బయటపడింది. నిధుల గల్లంతు విషయం ఆ నోటా ఈ నోటా పడి గ్రామంలోని ఖాతాదారులందరికీ తెలిసి ఆందోళన చెందుతున్నారు. తమ పాస్‌ పుస్తకాలతో మంగళవారం స్థానిక పోస్టాఫీసు వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు పాస్‌ పుస్తకాలతో కొండపల్లి సబ్‌పోస్టాఫీసుకు చేరుకుని తమ డిపాజిట్లు ఏమయ్యా యని ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఖాతాదారులు భారీగా ఉండడంతో అధికారులు విచారణ పూర్తయిన తరువాతే పోస్టుమాస్టర్‌ ఎంతమేర గోల్‌మాల్‌ చేసిందీ తేలదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

1500లకు పైగా ఖాతాలు

కవులూరు గ్రామంలో 1200 వరకు ఇళ్లు ఉండగా 1,712 కుటుంబాలకు చెందిన ఏడు వేల మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. గ్రామలోని బ్రాంచ్‌ పోస్టాఫీసులో సుమారు 1500లకు పైగా ఖాతాలు ఉన్నాయని సమాచారం. ఎనిమిది నెలలుగా ఖాతా దారులు డిపాజిట్‌ చేస్తున్న సొమ్మును పోస్టుమాస్టర్‌ వారి ఖాతాల్లో జమ చేయకుండా ఎగవేస్తున్నట్లు తెలిసింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు, రికరింగ్‌ డిపాజిట్‌లు, సేవింగ్స్‌ ఖాతాలు, టీడీ ఖాతాలు, సుకన్య సమృద్ధి వంటి పథకాల కింద గ్రామస్తులు ఎక్కువగా నగదును జమ చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా ఇక్కడ పోస్టుమాస్టర్‌గా పని చేస్తున్న మహిళ ఖాతా దారుల సొమ్మును ఎగవేసేందుకు పక్కా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఖాతాదారుల నగదును జమ చేసినప్పుడు పుస్తకాలలో రాసి, అకౌంట్‌లో జమ చేయకపోవడం, ఖాతాదారులు సొమ్ము విత్‌డ్రా కోసం సంతకాలు సేకరించి వారికి తిరిగి సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేయడం, కొందిరి వద్ద ఖాతా పుస్తకాలు సైతం తీసుకొని ఐదు నెలలుగా తిరిగి ఇవ్వకపోవడం వంటి చర్యలతో నగదు గోల్‌మాల్‌ చేసినట్లు వ్యక్తమవుతోంది.

నా భార్య శ్రీదేవి ఖాతాలో జమ చేసిన రూ.78,222కి గానూ అకౌంట్‌లో రూ.10 వేలే ఉన్నాయని అధికారులు చెప్పారు. పోస్టాఫీసులో అయితే సొమ్ము భద్రంగా ఉంటుందని దాచుకుంటే అక్కడ కూడా మాయం చేయడం దారుణం. ఉన్నతాధికారులు విచారణ జరిపి మా సొమ్ము మాకు ఇప్పించాలి. పోస్టాఫీసులో నిధుల గల్లంతు విషయం తెలిసి గ్రామస్తులు అందరూ ఆందోళన చెందుతున్నారు.

– చెరుకూరి వెంకట నర్సింహారావు, గ్రామస్తుడు, కవులూరు

నేను మూడు సంవత్సరాలుగా పోస్టాఫీసులో నెలకు రూ.1500 చొప్పున దాచుకుంటున్నాను. నెల రోజుల క్రితం డబ్బులు అవసరమై విత్‌డ్రా చేసేందుకు వెళ్తే పోస్టుమాస్టర్‌ సంతకం పెట్టించుకున్నారు. నెల గడిచినా నాకు రావాల్సిన అసలు రూ.54 వేలు, వడ్డీ గదును ఇంత వరకు ఇవ్వలేదు. ప్రతి రోజూ అడుగుతున్నప్పటికీ మాట దాట వేస్తున్నారు కానీ డబ్బులు ఇవ్వడంలేదు.

– చెరుకూరి గంగయ్య, ఖాతాదారుడు, కవులూరు

మహిళ అకౌంట్లో నగదు మాయంతో వెలుగులోకి..

కవులూరు పోస్టాఫీసులో సాధారణ తనిఖీలు చేసిన తపాలా శాఖ ఉన్నతాధికారులు ఈ నెల 18వ తేదీన గ్రామానికి చెందిన ఖాతాదారు చెరుకూరి శ్రీదేవిని పోస్టాఫీసుకు పిలిపించి, ఆమె అకౌంట్‌ పుస్తకాన్ని పరిశీలించారు. అకౌంట్లో రూ.78 వేలు నగదు ఉన్నట్లు నమోదవగా, ఖాతాలో మాత్రం రూ.10 వేలే ఉండడంతో నగదు మాయమైనట్లు గుర్తించారు. ఖాతాదారు శ్రీదేవిని ఎప్పుడైనా నగదు విత్‌డ్రా చేశారా అని అధికారులు ప్రశ్నించగా తామెప్పుడూ డబ్బులు తీసుకోలేదని ఆమె స్పష్టం చేయడంతో నిధుల గల్లంతు విషయం బయటకొచ్చింది. గ్రామానికి చెందిన జువ్వా రాంబాబు, నిమ్మగడ్డ నాగలక్ష్మి, పసుమర్తి కుమారి కొండపల్లి సబ్‌ పోస్టాఫీసుకు వెళ్లి ఖాతాలో నగదును చెక్‌చేయించగా ఏడు నెలలుగా ఖాతాలో నగదు జమకావడంలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో కంగుతిన్నారు. గోల్‌మాల్‌ విషయం తెలుసుకున్న కవులూరు గ్రామస్తులు తమ ఖాతా పుస్తకాలతో కొండపల్లి పోస్టాఫీసుకు క్యూ కట్టి ఖాతాలను చెక్‌చేయించడం ప్రారంభించారు. కొందరి ఖాతాలలో నగదు జమైనట్లు, మరి కొందరి ఖాతాలలో జమ కానట్లు అక్కడ అధికారులు చెప్పడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విధంగా పోస్టుమాస్టర్‌ భారీగా నగదును ఎగవేసినట్లు సమాచారం.

పోస్టాఫీసులో నగదు గోల్‌మాల్‌ 1
1/2

పోస్టాఫీసులో నగదు గోల్‌మాల్‌

పోస్టాఫీసులో నగదు గోల్‌మాల్‌ 2
2/2

పోస్టాఫీసులో నగదు గోల్‌మాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement