
విద్యార్థులను కొట్టిన ఘటనపై ఎంపీడీఓ విచారణ
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): కిలేశపురం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులపై టీచర్ దాడి చేసిన ఘటనపై ఎంపీడీవో శకుంతల విచారణ చేపట్టారు. ఈనెల 11న ‘విద్యార్థులను చితకబాదిన టీచర్’ కథనం ‘సాక్షి’లో వెలువడింది. ఇందుకు స్పందించిన ఎంపీడీఓ సోమవారం పాఠశాలలో విచారించారు. విద్యార్థులను పిలిపించి టీచర్ కొట్టిన అంశంపై ఆరా తీశారు. టీచర్ చెప్పిన మాట వినలేదని లావు కర్రతో అందరినీ కొట్టిందని ఎంపీడీవోకు విద్యార్థులు తెలిపారు. ఆరోజు తరగతి గదిలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు విద్యార్థులు వెల్లడించారు. విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయురాలు రజని మాత్రం తాను కొట్టలేదని, పిల్లలు చెప్పేది అంతా అబద్ధమని చెప్పారు. దెబ్బలు తిన్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, టీసీలు తీసుకోవద్దని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఎంపీడీవో సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో పెట్టిన ఫిర్యాదుపై మరో విచారణ జరగాల్సి ఉంది. ఎంఈఓ సీహెచ్ పుష్పలత, హెచ్‌ఎం బేబీరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులను కొట్టిన ఘటనపై ఎంపీడీఓ విచారణ