
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం
గన్నవరం: మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం వద్ద చైన్నె–కోల్‌కత్తా జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు పామర్రుకు చెందిన బాలిరెడ్డి మాణిక్యమ్మ(65) మరో ముగ్గురితో కలిసి వంట పనులు చేసేందుకు దుర్గాపురంలోని శివాలయం వద్దకు వచ్చారు. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతున్న మాణిక్యమ్మను విజయవాడ నుంచి ఏలూరు వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్సనిమిత్తం అదే కారులో గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.