రైతుల కష్టం నీటిపాలు | - | Sakshi
Sakshi News home page

రైతుల కష్టం నీటిపాలు

Oct 12 2025 8:01 AM | Updated on Oct 12 2025 8:01 AM

రైతుల కష్టం నీటిపాలు

రైతుల కష్టం నీటిపాలు

ఏడాదిలో మూడో సారి

పరిహారం అందేనా?

సిద్ధంగా ఉన్నాం

రైతులను ఆదుకోవాలి

వరదలతో ఖరీఫ్‌ పంటలకు అపార నష్టం

ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసిన ఉద్యానశాఖ

పంట నష్టం నమోదుకు రైతుల ఎదురుచూపులు

ఈ సారైనా పరిహారం అందేనా అని అనుమానం

కంకిపాడు: ఖరీఫ్‌ సాగుచేపట్టిన రైతులను కష్టాలు వీడటం లేదు. వరుసగా వస్తున్న వరదలకు రైతులు కుదేలవుతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో స్పందించాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరుస వరదలతో ఏటిపాయ వెంబడి సాగులో ఉన్న పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలకు వాటిల్లిన నష్టాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే కూడా చేపట్టలేదు. దీంతో పరిహారం అందుతుందా? లేదా? అన్న సందేహాలు రైతుల కంటి మీద కునుకు కరువయ్యేలా చేస్తున్నాయి.

కృష్ణానది ఏటిపాయ వెంబడి ప్రధానంగా ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. ముఖ్యంగా పసుపు, అరటి, కంద, పూలతోటలు, కూరగాయల తోటలు, తమలపాలకు ఇతర పంటలు సాగవుతున్నాయి. లక్షలాదిరూపాయలు పెట్టుబడులు పెట్టి పంటను సంరక్షించుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి వరద ముంచుకొచ్చింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. రైతులు దెబ్బతిన్న పంటలను తొలగించి తిరిగి సాగుకు ఉపక్రమించారు. ఈ ఏడాది మేలో అకాల వర్షాలకు ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. కృష్ణాజిల్లాలో 64.3 హెక్టార్లలో అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదించారు. తాజాగా కృష్ణానదికి మరోమారు వరద వచ్చి పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏటిపాయ వెంబడి సాగులో ఉన్న వివిధ రకాల ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. ఈ దఫా రోజుల తరబడి పంట పొలాల్లో వరదనీరు నిలిచిపోవటంతో మొక్క దశలో ఉన్న పసుపు, కంద, కూరగాయలు, పూల తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. లక్షల రూపాయలు పంటపై పెట్టిన పెట్టుబడులు కోల్పోవాల్సి వచ్చిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.

ప్రాథమిక అంచనాలు సిద్ధం!

వరదలతో ఏర్పడిన పంట నష్టంపై ఉద్యానశాఖ ప్రాథమిక అంచనాలను రూపొందించింది. జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల, తోట్లవల్లూరు, పమిడిముక్కల, కోడూరు మండలాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లినట్లు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు, కంద, పూలతోటలు ప్రధానంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 2,863 మంది రైతులకు చెందిన 2244.63 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదికలో పొందుపరిచారు. దీన్ని బట్టి వరదలకు జిల్లాలో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయవచ్చు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కృష్ణానదికి వరదలు, అధిక వర్షాలు వచ్చి పంటలు దెబ్బతిన్నా, ఈదురుగాలులకు పంటలు నేలవాలినా కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఒక్క రూపాయి పరిహారం కూడా రైతులకు అందించలేదు. తాజాగా కృష్ణానదికి వచ్చిన వరదతో రైతులకు మునుపెన్నడూ లేని విధంగా భారీగా నష్టం జరిగింది. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రాథమిక నష్టం అంచనాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాగానే పంట నష్టం సర్వే పూర్తి చేసి నివేదికను పంపుతాం. క్షేత్రస్థాయిలో సిబ్బందికి కూడా సూచనలు అందించాం. మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నాం.

– జె.జ్యోతి,

జిల్లా ఉద్యానశాఖ అధికారి, కృష్ణాజిల్లా

ఏటిపాయకు వచ్చిన వరదతో పంటలు దెబ్బతిన్నాయి. కుళ్లిపోయిన పంటలతో పెట్టుబడులు కోల్పోతున్నాం. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి ప్రతి ఎకరం నమోదు చేయాలి. రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవహరించాలి.

– వడుగు శ్రీనివాసరావు, రైతు, మద్దూరు

ప్రస్తుతం ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా పంట నష్టం సర్వే ప్రక్రియను చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారులకు ఇంకా శాఖాపరమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో పంట నష్టం సర్వే ప్రక్రియ ప్రారంభానికి నోచలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ సంక్షేమాన్ని విస్మరిస్తోందన్న వాదనలకు తాజా చర్యలు బలం చేకూరుస్తున్నాయి. ముంపునకు గురైన ప్రతి ఎకరాన్ని నమోదు చేయాలన్న డిమాండ్‌ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకూ సర్వే ప్రారంభం కాకపోవటంతో ఎప్పటికి సర్వే జరుగుతుందో అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement