
యువకుడి మోసంపై యువతి ఆందోళన
మక్కపేట(వత్సవాయి): ఓ యువకుడు మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం చేశాడని యువతితో పాటు కుటుంబసభ్యులు ఆందోళన చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాధితురాలు యండ్రాతి అరుణ్య, నూతక్కి సందీప్ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అయితే గతేడాది అరుణ్య గర్భవతి కావడంతో కుటుంబసభ్యులు గమనించి వివరాలు తెలుసుకుని గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువకుడు సందీప్ తనకు వివాహం చేసుకోవడానికి ఏడాదిన్నర సమయం కావాలని అంతేకాకుండా గర్భం కూడా తీసేసుకుంటేనే వివాహం చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకుని కాగితాలు రాసుకున్నారు. తరువాత యువతి గర్భం తొలగించుకుంది. ఇప్పుడు ఏడాదిన్నర సమయం రావడంతో యువతి కుటుంబసభ్యులు పెద్దల దగ్గరకు వెళ్లారు. దీంతో వాళ్లు యువకుడిని పిలిచి అడగ్గా పెళ్లి తనకు ఇష్టం లేదని తనని వివాహం చేసుకోలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంభసభ్యులు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని పోలీసులు చెప్పడంతో యువతితో పాటు కుటుంబసభ్యులు మక్కపేట గాంధీ సెంటర్‌లో ఆందోళన చేశారు.
వైఎస్సార్ సీపీ భవనానికి ఓసీ జారీపై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: మచిలీపట్నంలో వైఎస్సార్ సీపీ భవనానికి అక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) జారీ చేసేలా పురపాలక శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ‘అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే భవన నిర్మాణం జరిగింది. తగిన ఫీజులనూ చెల్లించాం. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ సమాధానం ఇచ్చాం. అయినా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కేవలం రాజకీయ కారణాలతోనే ఇలా చేస్తున్నారు. భవన నిర్మాణంలో పలు లోపాలు ఉన్నాయని మునిసిపల్ కార్పొరేషన్ చేస్తున్న వాదనల్లో ఎటువంటి వాస్తవం లేదు’ అని నాగిరెడ్డి వాదనలు వినిపించారు.