
అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో గురువారం సాయంత్రం జిల్లా విజిలెన్స్, మోనిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల విషయంల ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. బందరు డివిజన్‌లో 14, గుడివాడలో 6, గన్నవరం 10, అవనిగడ్డ 5 మొత్తం 35 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 31 మంది బాధితులకు రూ. 66.23లక్షల పరిహారం ప్రభుత్వం ద్వారా అందించామన్నారు. సమావేశంలో పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్‌రాజా, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఏఎస్పీ బీవీ నాయుడు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీఎస్పీలు సీహెచ్ రాజా, పి. విజయశ్రీ, ధీరజ్ వినీల్, సీహెచ్ శ్రీనివాసరావు, ఆర్డీవో కె. స్వాతి, గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహాల్లో విద్యార్థుల
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం తదితర సదుపాయాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 90 ప్రభుత్వ వసతి గృహాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్‌లను నెలకోసారి పరిశుభ్రం చేయాలన్నారు. ఇందుకోసం ఒక రిజిష్టర్‌ను నిర్వహించి స్థానికుల సంతకాలు సేకరించాలన్నారు. వసతిగృహాల్లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి వసతి గృహంలో క్లోరినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు ప్రతి నెల మూడో గురువారం వసతి గృహాన్ని సందర్శించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షేక్ షాహెద్‌బాబు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, బీసీ సంక్షేమాధికారి జి. రమేష్, గిరిజన సంక్షేమాధికారి ఎం. ఫణిదూర్జటి, డీఎండ్‌హెచ్‌వో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.