
ఎవరూ కేసులకు భయపడాల్సిన పనిలేదు
వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భరోసా
జిల్లాకో కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టేశారని విమర్శ
విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం
ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా వైఎస్సార్ సీపీ కార్యాచరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సూచించారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం విజయవాడలోని ఓ హాలులో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏడు నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రజల పక్షాన పోరుబాట..
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కష్టాలు తీర్చేందుకు రైతుల పక్షాన పోరాడామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తమ దృష్టిలో ఉన్నట్లు తెలిపారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. డయేరియా బాధితులను ప్రభుత్వం వదిలేసిందన్నారు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా మీడియాను అడ్డుపెట్టుకొని వాస్తవాలు కప్పి పెడుతున్నట్లు విమర్శించారు. వైఎస్ జగన్ దూర దృష్టితో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుడితే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం పేదలకు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ పాలన సాగించారని గుర్తుచేశారు.
ప్రతిపక్షంపై అభాండాలు..
కల్తీ మద్యం తయారు చేసింది కూటమి ప్రభుత్వమని.. కానీ నిందలు వేసేది మాత్రం వైఎస్సార్ సీపీ మీద అని సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రతి జిల్లాకు కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టేశారన్నారు. పార్టీకి సంబంధించి గ్రామ మండల స్థాయి కమిటీలు అన్ని పూర్తి చేస్తామన్నారు. పార్టీ అధినేత జగన్ ఆదేశం ప్రకారం 29 అనుబంధ విభాగాల నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ చేసి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మొండితోక అరుణకుమార్, రూహుల్లా, పార్టీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, పార్టీ జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్ టీ యూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, నాయకులు షేక్ ఆసిఫ్, పోతిన మహేష్, సర్నాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.