
బాధితులకు అండగా ఉండటం అందరి బాధ్యత
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు
బూసి వినిత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాధితులకు అండగా నిలవడంతోపాటు వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినిత అన్నారు. విజయవాడ హనుమాన్‌పేట ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని వన్‌స్టాప్ సెంటర్‌ను శుక్రవారం ఆమె సందర్శించారు. మహిళలకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. వన్‌స్టాప్ సెంటర్ పనితీరును సమీక్షించారు. రికార్డులు తనిఖీ చేశారు. సెంటర్ సిబ్బంది స్వప్న, డబ్ల్యూఎస్‌ఐ ప్రేమలత ఇతర సిబ్బందితో సమావేశమై బాధితులకు అందుతున్న సాయం, కేసుల పరిష్కారం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వినీత పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు, ఆమెకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్థీషియాలజిస్ట్స్(ఐఎస్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ వై.అచ్యుతరావు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ డీవీ మహేశ్వరరావు ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి డాక్టర్ యు.తారక ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డాక్టర్లు అల్లు పద్మజ, డి.రాజశేఖర్, కె.అపరంజి, సీహెచ్ రాకేష్, పి.అనిల్ కుమార్, కె.వినీలనాథ్, ఉదయ్‌శంకర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి ఐఆర్‌సీఎఫ్ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎస్‌సీ చక్రరావు, ఐఎస్‌ఏ నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎ.కామేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపారు.