
‘విజయ’ అవుట్‌లెట్లలో డ్వాక్రా ఉత్పత్తుల విక్రయం
హనుమాన్‌జంక్షన్ రూరల్: మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ‘విజయ’ బ్రాండ్ పేరిట విక్రయించేందుకు కార్యాచరణ చేపట్టామని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. స్థానిక విజయవాడరోడ్డులోని కాకాని భవనంలో చలసాని అధ్యక్షతన 35వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేయడంతోపాటు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు. గత ఆరేళ్లలో గణనీయమైన వృద్ధి సాధించామని తెలిపారు. 2018–19లో పాల సేకరణ 6.04 కోట్ల లీటర్లు కాగా, ప్రస్తుతం 10.29 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొన్నారు. యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.