
బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి
అసెంబ్లీలో వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్‌జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపాటు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ిసనీ హీరో చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనాలని, తక్షణమే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ, కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ దేవినేని అవినాష్ వందలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం విజయవాడలోని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మంచి చేసిన వారిని తూలనాడటం బాల కృష్ణకు అలవాటేనన్నారు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి.. మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ అన్నారు. సభలో లేని వ్యక్తినే కాకుండా, అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా తూలనాడారన్నారు. చిరంజీవిని కించపరిచేలా మాట్లాడినా.. కనీసం ఖండించలేని స్థితిలో జనసేన అధినేత, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం సిగ్గుచేటన్నారు.
గౌరవం పోయింది..
ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే తమకు దైవ సమానమని అవినాష్ అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా బాలకృష్ణపై ఉన్న గౌరవం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో పోయిందన్నారు. రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు మంచి చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, ఆయనపైనా దుర్భాషలాడటం దారుణమన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్‌లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.