
దుర్గమ్మ సేవలో శాసన మండలి చైర్మన్
వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను శుక్రవారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకం సుఖసంతోషాలతో ఉండాలని, పకృతి వైపరీత్యాలు లేకుండా పాడిపంటలు, పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
కబడ్డీ పోటీలు ప్రారంభం
మైలవరం: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ పోటీలు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని 12 కళాశాలలోని విద్యార్థులు పాల్గొంటున్నట్లు కళాశాల పీడీ మేజర్ మన్నే స్వామి తెలిపారు. మొదటి రోజు ఈ పోటీలను లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. అప్పారావు ప్రారంభించారు. డాక్టర లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి మాట్లాడుతూ నాకవుట్ పద్ధతి పోటీలు నిర్వహించామని, దీనిలో కేబీఎన్ కళాశాల, సిద్ధార్థ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల, విజయ కళాశాల లీగ్ దశకు అర్హత సాధించాయని తెలిపారు.
నాట్యాచార్య పిళ్లాకు
ప్రతిష్టాత్మక పురస్కారం
విజయవాడ కల్చరల్: నగరానికి చెందిన నాట్యాచార్యుడు పిళ్లా ఉమామహేశ్వర పాత్రుడుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్రనాట్య రూప శిల్పి నటరాజ రామకృష్ణ పురస్కారం లభించింది. 2024 సంవత్సరానికి గానూ తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఉమామహేశ్వరపాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ గురువారం హైదరాబాద్‌లో జరిగిన సభలో అవార్డ్‌తోపాటు నగదు బహుమతిని విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలిదండ్ల నిత్యానందరావు, తెలంగాణ ఉన్నత విద్యాకార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంచాలకులు డాక్టర్ ఎస్. భూపతిరావు చేతులమీదుగా అందజేశారని పేర్కొన్నారు.

దుర్గమ్మ సేవలో శాసన మండలి చైర్మన్