
మంచి సేవలు అందిస్తా..
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దృష్టిసారించి, జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ అన్నారు. జాయింట్ కలెక్టర్‌గా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ తాను 2019 బ్యాచ్‌కు చెందినవాడినని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలైన ప్రజాసమస్యలు, భూ సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో ఎటు వంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నియమాల ప్రకారం పనిచేస్తానన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారుల సహకారంతో ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. తాను తిరుపతి జిల్లాకు చెందిన వాడినని, తన విద్యాభాస్యం అక్కడే జరిగిందన్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా శిక్షణ పొంది మొదటిగా సత్యసాయి జిల్లా పెనుగొండ సబ్‌కలెక్టర్‌గా పనిచేశానన్నారు. అనంతరం శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లి అక్కడ పనిచేసిన అనంతరం ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా అమరావతికి వచ్చానన్నారు. అక్కడి నుంచి కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారని, జేసీగా రెండోసారి బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు.
మర్యాదపూర్వకంగా..
అనంతరం జేసీ నవీన్ కలెక్టర్ డీకే బాలాజీని ఆయన చాంబర్‌లో కలిసి మర్యాదపూర్వకంగా మొక్కను అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీ నవీన్‌ను డీఆర్వో చంద్రశేఖరరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి. శివరామప్రసాద్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, ఆర్డీవో కె. స్వాతి, డీఎస్‌వో మోహనరావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, కలెక్టరేట్ ఏవో రాధిక, సిబ్బంది కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.