కనుల పండువగా నగరోత్సవం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా నగరోత్సవం

Sep 24 2025 4:55 AM | Updated on Sep 24 2025 4:55 AM

కనుల

కనుల పండువగా నగరోత్సవం

కనుల పండువగా నగరోత్సవం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేదమాత గాయత్రీదేవిగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం దుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువ జాము నుంచి ఉదయం ఆరు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు, ఉభయదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు కొండపైకి చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని పలువురు ఉభయదాతలు నేరుగా కలెక్టర్‌ లక్ష్మీశకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆరు గంటల తర్వాత సర్వ దర్శనం క్యూలో భక్తుల రద్దీ కొనసాగింది. అయితే రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు భక్తులను రూ.100 క్యూలోకి అను మతించారు. అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, శ్రీ చక్రనవార్చన, చండీయాగం, కుంకుమార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక కుంకుమార్చనను మొదటి షిఫ్టునకే పరిమితం చేశారు.

వీఐపీ దర్శనాలకు బ్రేక్‌

తొలి రోజు ఆలయ ప్రాంగణంలో ఇష్టానుసారంగా వీఐపీల పేరిట జరిగిన దర్శనాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. ప్రొటోకాల్‌ ఉన్న వారిని సీఎం గేటు, వీఐపీల పేరుతో వచ్చే వారిని గాలిగోపురం వద్ద ఉన్న క్యూలైన్‌ ద్వారానే ఆలయంలోకి అనుమతించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మంగళవారం ఉదయం లడ్డూ తయారీ పోటులను తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న పదార్థాల నాణ్యతను పరిశీలించారు. రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు? మొదటి రోజు ఎన్ని విక్రయించారు? ఇంకా ఎన్ని నిల్వ ఉన్నాయన్న వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిత్యం 2.50 లక్షల లడ్డూలను తయారీ చేసేలా దేవస్థానం మూడు లడ్డూ పోటులను సిద్ధం చేసిందని, ఉత్సవాల్లో 36 లక్షల లడ్డూలు అవసరమయవుతా యని అంచనా వేశామని తెలిపారు. లడ్డూ విక్రయ కేంద్రాలను మంగళవారం నుంచి మరి కొన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చామ న్నారు. ప్రస్తుతం కనకదుర్గనగర్‌లో పది కౌంటర్లు ఉండగా, అక్కడ మరో రెండు కౌంటర్లు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌తో పాటు రథం సెంటర్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటర్లకు లడ్డూలు రవాణా చేసే తరుణంలో ఎదురవుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులను కలెక్టర్‌ దృష్టికి ప్రసాదం కేంద్ర సహాయ అధికారి ఎం.ఎస్‌.ఎల్‌.శ్రీనివాస్‌ తీసుకెళ్లారు. అన్న ప్రసాద వితరణను పరిశీలించిన కలెక్టర్‌ భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

నగరోత్సవంలో

దుర్గామల్లేశ్వర స్వామివార్లు

రెండో రోజు ఆదాయం రూ.25.48లక్షలు

వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్‌.సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి, బండారు శ్రావణి, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వేద పండితులు వేదాశీర్వచనం, ఆలయ ఈఓ శీనా నాయక్‌ అమ్మవారి చిత్రపటాలు అందజేశారు.

దసరా ఉత్సవాల్లో రెండో రోజున దేవస్థానానికి రూ.25.48 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. రూ.300 టికెట్ల విక్రయం ద్వారా రూ.8.99 లక్షలు, రూ.100 టికెట్ల ద్వారా రూ.3.16 లక్షలు, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1.86 లక్షలు, ఆరు లడ్డూల ప్రత్యేక ప్యాక్‌ల ద్వారా రూ.9.66 లక్షలు, ప్రత్యేక కుంకుమార్చన టికెట్ల ద్వారా రూ.69 వేలు, ఇతర సేవా టికెట్ల విక్రయం ద్వారా ఈ ఆదాయం లభించిందని వివరించారు. రెండో రోజు సాయంత్రం ఐదు గంటలకు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 19,629 మందికి అన్న ప్రసాదం అందజేశామని తెలిపారు.

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన నగరోత్సవం కనుల పండువగా సాగింది. మంగళవారం సాయంత్రం మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్‌, ఘాట్‌రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట ఆదిదంపతుల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో నగరోత్సవం పరిసమాప్తమైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, చిన్నారుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో నగరోత్సవం ఆద్యంతం భక్తిభావనతో సాగింది.

కనుల పండువగా నగరోత్సవం 1
1/3

కనుల పండువగా నగరోత్సవం

కనుల పండువగా నగరోత్సవం 2
2/3

కనుల పండువగా నగరోత్సవం

కనుల పండువగా నగరోత్సవం 3
3/3

కనుల పండువగా నగరోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement