
11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ 11 విశేష అలంకారాల్లో భక్తులను కరుణించనున్నారు. తిథుల హెచ్చుతగ్గుల కారణంగా అలంకారాల్లో మార్పులు వస్తుంటాయని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. మొదటిగా శ్రీబాలా త్రిపుర సుందరీదేవి, రెండో అలంకారంగా శ్రీగాయత్రిదేవి, మూడో అలంకారంగా శ్రీఅన్నపూర్ణాదేవి, నాల్గో అలంకారంగా శ్రీకాత్యాయనిదేవి, ఐదో అలంకారంగా శ్రీమహాలక్ష్మీదేవి, ఆరో అలంకారంగా శ్రీ లలితా త్రిపురసుందరీదేవి, ఏడో అలంకారంగా శ్రీమహాచండీదేవి, ఎనిమిదో అలంకారంగా శ్రీసరస్వతిదేవి, తొమ్మిదో అలంకారంలో శ్రీదుర్గాదేవి, పదో అలంకారంలో శ్రీ మహిషాసుర మర్దినీదేవి, పదకొండో అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఏడాది కాత్యాయని దేవి అలంకారం అదనం కావడంతో పండుగ 11 రోజులకు వచ్చింది.
నిరంతరం ప్రసాద వితరణ..
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కొండ దిగువన మహా మండపం ఎదుట నూతన అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలోనే ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని భక్తులకు అందజేస్తారు. ఒకే దఫా వెయ్యి మంది అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఇక క్యూలైన్‌లో చిన్నారుల కోసం పాలు, పెద్దల కోసం బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లను అందజేయనున్నారు.