
పర్యావరణ పరిరక్షణలో మొక్కలు కీలకం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణలో మొక్కల పెంపకం కీలకమని, ప్రతి ఒక్కరూ వారి దైనందిన జీవితంలో మొక్కలు నాటాలని విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. ‘స్వచ్చతా హీ సేవా–2025’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ డివిజన్ వ్యాప్తంగా 41 ప్రాంతాలలో మొక్కల పెంపకంపై డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా పలు రైల్వేస్టేషన్‌లు, కాలనీలు, హాస్పిటల్స్, హెల్త్ యూనిట్‌లతో పాటు విజయవాడలోని ఎలక్ట్రికల్ లోకో షెడ్, డిజిల్ లోకో షెడ్, కోచింగ్ డిపో, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ మొక్కలు నాటడం కేవలం పర్యావరణ పరిరక్షణే కాదని, అది మన ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి అని తెలిపారు. ఈ రోజు నాటిన మొక్క భవిష్యత్తులో పరిశుభ్రమైన, పచ్చని ఆహ్లాదకర, ఆరోగ్యవంతమైన సామాజం వైపు అడుగును సూచిస్తుందన్నారు. నాటిన ప్రతి మొక్కను రైల్వే సిబ్బంది పర్యవేక్షించాలని, తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని, మెరుగైన సమాజం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు బ్రాంచ్‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా