
షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా పరిచయం శుభపరిణామం
కృష్ణలంక(విజయవాడతూర్పు):కొత్త ఆలోచనలు, ఆశలతో ఎంతో మంది కళాకారులు షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కావడం శుభపరిణామమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌భీమన అన్నారు. మహాకవి గురజాడ జయంతి సందర్భంగా రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలుగు షార్ట్ ఫిల్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో చిన్న సినిమా–పెద్ద సందేశం పేరుతో జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్, ప్రైవేట్ పాటల వీడియోలు, రీల్స్ పోటీలు నిర్వహించారు. షార్ట్‌ఫిల్మ్ పోటీలను అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు యడ్ల పార్థసారథి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్‌భీమన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్త తరానికి ప్రోత్సాహమిస్తూ షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. తనతో పాటు చాలామంది నటీనటులు, దర్శకులు షార్ట్ ఫిల్మ్‌ల ద్వారానే సినీపరిశ్రమకు పరిచయం అయ్యామన్నారు. మరింత మంది నూతన నటీనటులు, టెక్నీషియన్స్, దర్శకులు, సంగీత దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు ఉపయోగపడతాయని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 15 షార్ట్ ఫిల్మ్‌లు, 31 రీల్స్, 9 ప్రైవేట్ పాటల వీడియోలను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వీరశంకర్, మాజీ ప్రధాన కార్యదర్శి వి.ఎన్.ఆదిత్య, ప్రజా వైద్యశాల వైద్యుడు డాక్టర్ మాకినేని కిరణ్, అమరావతి బాలోత్సవం కార్యదర్శి కొండలరావు, ఎం.బి.విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, డి.వి.రాజు తదితరులు పాల్గొన్నారు.