
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం
జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో మహాధర్నా మద్దతు తెలిపిన వివిధ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యం, వైద్య విద్యను దూరం చేయడమేనని పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాలను కలుపుకొని విజయవాడ ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
జీవోలు దగ్ధం
మహాధర్నా ప్రాంగణంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడ్‌కు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను జడ శ్రావణ్‌కుమార్, ఇతర నేతలు కలిసి దగ్ధం చేశారు.
ధర్నాలో పాల్గొన్న వ్యక్తులు,
సంఘాలివే...
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, వికలాంగుల విభాగం పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్‌రాజ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్, హైకోర్టు న్యాయమూర్తి, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కో ఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు, వీసీకే పార్టీ నేత గంజి రామారావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి, లోక్‌జనశక్తి నేత చింతా వెంకటేశ్వర్లు, సుమమాల అధ్యక్షుడు భాస్కరరావు, మాలమహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచ నాగమల్లీశ్వరి, ఐయూఎంఎల్ ఖాజావలి పాల్గొన్నారు. మున్సిపల్, రైల్వే ఉద్యోగ సంఘాలు, విశ్రాంత ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. తెలంగాణకు చెందిన రాజేష్ ప్రసంగం, పాట అందరినీ ఆకట్టుకుంది.
జార్ఖండ్ తరహాలో ఉద్యమిద్దాం
జార్ఖండ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ప్రజలు తిరగబడి మళ్లీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకు వచ్చేలా చేశారు. అదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, పార్టీలల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ప్రభుత్వం మెడలు వంచుదాం.
–శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
అగ్రవర్ణ పేదలకు నష్టమే
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా అగ్రవర్ణ పేదలకు సైతం వైద్య విద్యను దూరం చేయడమే అవుతుంది. దీనిపై అందరినీ కలుపుకొని వచ్చే నెలలో ఏలూరులో బహిరంగ సభ నిర్వహిస్తాం.
–జడ శ్రావణ్‌కుమార్,
జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు
బాబు ఆలోచన కార్పొరేట్ల గురించే..
పేదల గురించి ఆలోచన చేసే నైజం చంద్రబాబుకు లేదు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తన కార్పొరేట్లకు, బంధువులకు సంపద సృష్టించే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు.
–పేర్ని నాని, మాజీ మంత్రి
ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు
చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తామంటున్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం
–విడదల రజని, మాజీ మంత్రి
చాలా దుర్మార్గం
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే, వాటిని చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తాననడం చాలా దుర్మార్గం.
–దేవినేని అవినాష్, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌జిల్లా
ప్రైవేటీ కరణ చేస్తే ఉద్యోగాలు కోల్పోతాం
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటు పరం చేస్తే వైద్య సీట్లతో పాటు వైద్య కళాశాల, ఆస్పత్రుల్లో పారా మెడికల్, నర్సింగ్, మినిస్టీరియల్ సిబ్బంది వంటి వేలాది ఉద్యోగాలు కోల్పోతాం.
–డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం