
డీఆర్‌ఎం విస్తృత తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు, రైల్వే స్టేషన్ల పరిశుభ్రతకు విజయవాడ డివిజన్ అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఆ దిశగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో అనేక స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త హంగును తీర్చిదిద్దుతోందని డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా తెలిపారు. బ్రంచ్ అధికారులతో కలసి ఆయన విజయవాడ డివిజన్‌లోని మచిలీపట్నం–గుడివాడ, భీమవరం టౌన్–నర్సాపూర్ సెక్షన్లలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ముందుగా మచిలీపట్నం చేరుకుని అమృత్ భారత్ పథకంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రన్నింగ్ రూమ్, కోచింగ్ డిపోలను తనిఖీ చేశారు. స్వచ్చతా హీ కార్యక్రమంలో భాగంగా స్టేషన్‌లో పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం గుడివాడ స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు. స్టేషన్‌లోని ప్రీమియం వెయిటింగ్ హాల్ ఆధునికీకరణ పనులు, మాడ్యులర్ టాయిలెట్ల ఏర్పాటు, స్టేషన్ ప్రవేశ ముఖద్వారం అభివృద్ధి పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తనిఖీ చేశారు. ఈ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి భీమవరం టౌన్ స్టేషన్ చేరుకున్న డీఆర్‌ఎం దివ్యాంగ ప్రయాణికుల సౌకార్యలను పరిశీలించారు. వారి సౌలభ్యం కోసం ర్యాంపు నిర్మాణాలు, మాడ్యులర్ టాయిలెట్లు, 12 మీటర్ల ఎఫ్‌ఓబీ నిర్మాణ పనులను సమీక్షించారు. నర్సాపూర్ స్టేషన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించిన అనంతరం నర్సాపూర్–నిడదవోలు సెక్షన్‌లో రియర్ విండో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ.. స్టేషన్‌లోకి అడుగుపెట్టే ప్రతి ప్రయాణికుడికి ప్రపంచస్థాయి సౌకర్యాలతో పాటు ఆహ్లాదకర ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.