
డీఎస్సీలో రాణించిన 17 మందికి సత్కారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల జరిగిన డీఎస్సీలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు పొందిన 17 మంది అభ్యర్థులను గ్రంథాలయాధికారులు సత్కరించారు. బందరు రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్, కార్యదర్శి వి. రవికుమార్ అభ్యర్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షలకు అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో మరింత మంది ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వసతి లేని విద్యార్థులు గ్రంథాలయాల్లో చదువుకోవాలన్నారు. ఉద్యోగాలు సాధించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ గ్రంథాలయ అధికారి కె.రమాదేవి, గ్రేడ్ 3 గ్రంథ పాలకురాలు వై.ధనలక్ష్మి, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
డిజిటల్ అరెస్టు పేరుతో రూ.42.20 లక్షలకు టోపీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని బెదిరించి రూ.42.20 లక్షలు స్వాహాచేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. 76 ఏళ్ల నరపరెడ్డి సత్యనారాయణమూర్తి నంద మూరినగర్ ఆరో లైన్‌లో నివశిస్తున్నారు. అతనికి ఈ నెల 11న ఎస్‌కే చౌదరి డేటా ప్రొటెక్టింగ్ బోర్డు ఆఫీసర్ పేరుతో కాల్ చేశారు. అతని ఆధార్ కార్డు చెల్లనిదిగా మారిందని, సేఫ్టీ కోసం మరో అకౌంట్ తెరవాలని నమ్మబలికారు. అనంతరం క్రైమ్ పోలీసుల మంటూ మరో రెండు నంబర్ల నుంచి వీడియో కాల్ చేసి బెదిరింపులకు దిగారు. వృద్ధుడిపై అరెస్టు వారెంట్ ఉందంటూ బెదిరించారు. పదే పదే ఫోన్‌లు చేసి డిజిట్ అరెస్టు అంటూ వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులు తాళలేక వృద్ధుడు ఈ నెల 15న ఆర్టీజీఎస్ ద్వారా రూ.42,20,280 వారు చెప్పిన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించి బుధవారం సైబర్ క్రైమ్ స్టేషన్‌లో సత్యనారాయణ మూర్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
మైలవరం(జి.కొండూరు): మైలవరం మండలంలోని పోరాటనగర్ గ్రామానికి చెందిన యువకుడు అజ్మీరా రమేష్‌నాయక్‌పై పోలీసులు బుధవారం పోక్సో కేసు న మోదు చేశారు. మైలవరం పోలీసుల కథనం మేరకు.. పోరాటనగర్ గ్రామానికి చెందిన అజ్మీరా రమేష్‌నాయక్ అదే గ్రామానికి చెందిన 17 బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. అనంతరం ఆమైపె లైంగికదాడి చేశాడు. రమేష్‌నాయక్ వేధింపులు తాళలేక ఆ బాలిక ఈ నెల 9వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సఅనంతరం కోలుకున్న బాలిక అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక తల్లి మైలవరం పోలీసులకు బుధవారం పిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈరోడ్–జోగ్బాని మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల కోరిక మేరకు విజయవాడ మీదుగా తమిళనాడులోని ఈరోడ్ స్టేషన్ నుంచి బిహార్‌లోని జోగ్బాని స్టేషన్ మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు రైల్వేబోర్డు పచ్చజెండా ఊపింది. ఈ నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో ఒక రోజు నడిచేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 25 నుంచి పార్రంభ మయ్యే ఈరోడ్–జోగ్బాని ఎక్స్‌ప్రెస్ (16601) ప్రతి గురువారం ఉదయం 8.10 గంటలకు ఈరోడ్‌లో బయలుదేరి గూడూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్లు, మంచిర్యాల మీదుగా శనివారం రాత్రి ఏడు గంటలకు జోగ్బాని చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (16602) ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు జోగ్బానిలో బయలుదేరి బుధవారం ఉదయం 7.20 గంటలకు ఈరోడ్ చేరుతుంది.