గవర్నర్‌కు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు ఆహ్వానం

Sep 18 2025 6:45 AM | Updated on Sep 18 2025 6:45 AM

గవర్న

గవర్నర్‌కు ఆహ్వానం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై 22వ తేదీ నుంచి నిర్వహించే దసరా ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు దేవదాయ శాఖ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. బుధవారం గవర్నర్‌ను దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, దుర్గగుడి ఈవో శీనానాయక్‌లతో పాటు ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అంతకు ముందు దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి దేవదాయ శాఖ కమిషనర్‌ గవర్నర్‌కు వివరించారు. తొలుత ఆలయ అర్చకులు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు వేద ఆశీర్వచనం అందజేసి, పట్టువస్త్రాలు, పవిత్రాలను అందించారు. అదే విధంగా ప్రభుత్వంలోని పలువురికి కూడా ఆహ్వాన పత్రికలను దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారులు అందజేశారు.

స్వర్ణాంధ్ర సాధనలో ఎన్‌ఎస్‌ఎస్‌ కీలకం

కోనేరుసెంటర్‌: స్వర్ణాంధ్ర సాధనలో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె. రాంజీ పేర్కొన్నారు. బుధవారం సెనేట్‌ హాల్‌లో విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు గ్రామాల్లో చేపట్టవలసిన సేవా కార్యక్రమాలపై చర్చించారు. విద్యార్థులకు డిజిటల్‌ లిటరసీ శిక్షణపై అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా గ్రామస్తులను భాగస్వాములను చేసి శుభ్రతా డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.ఉష, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం సమన్వయకర్త డాక్టర్‌ ఎం. శ్రావణి, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఘనంగా విశ్వకర్మ జయంతి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విరాట్‌ విశ్వకర్మ జయంతి వేడుకలు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. బుధవారం కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సంప్రదాయ కళలు, కళాకారుల క్షేమం, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. విశ్వకర్మ యోజన ద్వారా సాధికారిత కల్పించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేతివృత్తుల కళాకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆధునిక నైపుణ్యాల సము పార్జన ద్వారా చేతివృత్తులకు కొత్త వైభవం వస్తుందని కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు.

గవర్నర్‌కు ఆహ్వానం 1
1/1

గవర్నర్‌కు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement