
లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డుదాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భవానీపురం బ్యాంక్ సెంటర్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై భవానీపురం బ్యాంక్ సెంటర్ సమీపంలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో స్వాతి సెంటర్ వైపు నుంచి వస్తున్న లారీ ఆ వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతని చేయి నుజ్జునుజ్జు అయింది. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు 40ఏళ్లు ఉంటుంది. అతని పూర్తి వివరాలు తెలియలేదు. దీనిపై సచివాలయ మహిళా పోలీసు వెంపటి శ్రీవల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.