
నిర్ణీత గడువులో అర్జీలకు పరిష్కారం
● కలెక్టర్ లక్ష్మీశ ● పీజీఆర్‌ఎస్‌కు 147 అర్జీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలనుంచి అందే అర్జీలకు నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో నమోదయ్యే అర్జీలు పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. అధికారులు ప్రతి రోజూ పీజీఆర్‌ఎస్ పోర్టల్ లాగిన్ అయి వారి శాఖ అర్జీలను పరిశీలించాలని, రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. అర్జీలను అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు అర్జీదారులతో మర్యాదగా మాట్లాడాలని, సవివరమైన ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని, గడువు లోపలే అర్జీలకు పారదర్శకమైన సమాధానాలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.