
నిర్లక్ష్యానికిదే ‘సాక్ష్యం’!
జగ్గయ్యపేట: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అంగన్ వాడీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన పథకం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు దృశ్య రూపంలో ఆటపాటలు, ఇంగ్లిష్, తెలుగు పదాల వంటి విద్యాపరమైన విషయాలు.. పౌష్టికాహార విలువలు, ఆరోగ్య సూత్రాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించటమే కాకుండా అంగన్‌వాడీ కార్యకర్తల శిక్షణతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహించటానికి కేంద్ర ప్రభుత్వం ‘సాక్ష్యం’ అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసింది. ఈ కేంద్రాలకు స్మార్ట్ టీవీలను పంపిణీ చేసింది. అయితే వాటిని కేంద్రాలలో అమర్చకపోవటంతో నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు కనీసం స్పందించటం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు స్మార్ట్ టీవీలను కేటాయించిన విషయం కనీసం కేంద్రాలకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు కూడా తెలియకపోవటం గమనార్హం.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్, అర్బన్ ప్రాంతాలలో 1,475 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో సొంత భవనం కలిగి ఉండి ప్రహరీ, మరుగుదొడ్లు, కిచెన్ నర్సరీలతో పాటు పూర్తి స్థాయిలో చిన్నారులకు ఆట వస్తువులున్న కేంద్రాలకు ‘సాక్ష్యం అంగన్‌వాడీ పోషణ్ 2.0’ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 440 కేంద్రాలను ఎంపిక చేసింది. ఇందులో జగ్గయ్యపేట 61, నందిగామ 121, తిరువూరు 85, మైలవరం 115, విజయవాడ రూరల్, అర్బన్ ప్రాంతాలలో 37 చొప్పున అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసి స్మార్ట్ టీవీలను పంపిణీ చేసింది. అయితే కేంద్రాలకు టీవీలు వచ్చి పక్షం రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ కేంద్రాలలో వాటిని అమర్చకపోవటంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఒక్కో టీవీ రూ.30వేలకు కొనుగోలు చేసి మరీ సరఫరా చేసింది. కొన్ని కేంద్రాలలో టీవీలను అమర్చినా నెట్ సౌకర్యం లేక వినియోగించడం లేదు.
నెట్ సౌకర్యం లేదు..
కేంద్రాలకు టీవీలను మంజూరు చేసినప్పటికీ నెట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రస్తుతం కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం లేకపోవటంతో పాటు కొన్ని కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండటంతో పాటు విద్యుత్ సరఫరాకు అనుమతిస్తారో లేదోనని అంగన్‌వాడీలు సంశయిస్తున్నారు. ఇదిలా ఉండగా అంగన్‌వాడీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం పలు సర్వేలను కేటాయించటంతో అదే పనిలో ఉంటున్నారని పిల్లలను సరిగా పట్టించుకోకపోవటంతో పిల్లలను పంపేందుకు కూడా ఆందోళన చెందాల్సి వస్తోందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించినా అందిపుచ్చుకోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపయోగంగా అంగన్‌వాడీ కేంద్రాలలో స్మార్ట్ టీవీలు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 440 కేంద్రాలకు మంజూరు ఒక్క టీవీనీ కేంద్రాల్లో ఉపయోగించని వైనం పట్టించుకోని అధికారులు
టీవీలను అమర్చుతాం..
అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరైన స్మార్ట్ టీవీలను వీలైనంత త్వరగానే అమర్చుతాం. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో వసతులు లేకపోవటంతో టీవీల ఏర్పాటులో జాప్యం జరిగింది. కేంద్రాల మరమ్మతులకు కూడా నిధులు మంజూరయ్యాయి. వాటిని కూడా చేపడతాం.
– రుక్సానా, పీడీ, మహిళా శిశు సంక్షేమ శాఖ

నిర్లక్ష్యానికిదే ‘సాక్ష్యం’!