
‘అమ్మా.. నాన్నా.. బతకాలని లేదు’
ఉయ్యూరు(పెనమలూరు): వరకట్న వేధింపులకు నవవధువు బలైంది. భర్త, అత్తమామల హింస, వేధింపులు తాళలేక తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఉయ్యూరు పట్టణ పోలీసుల కథనం మేరకు.. ఉయ్యూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న జూనియర్ కళాశాల లెక్చరర్ వర్రె శ్రీ విద్య(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
వివాహం అయినప్పటి నుంచీ..
మొవ్వ మండలం కొండవరానికి చెందిన శ్రీ విద్యకు కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌తో ఐదునెలల క్రితం వివాహం జరిగింది. అరుణ్‌కుమార్ కలవపాముల సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్నారు. వీరు ఉయ్యూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. శ్రీ విద్య ఉయ్యూరు పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. వివాహం అయిన నాటి నుంచి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. కట్నం తీసుకురమ్మంటూ, అందంగా లేవంటూ తన మాజీ ప్రియురాలి మాదిరిగా లేవంటూ అరుణ్‌కుమార్ హింసించటం మొదలుపెట్టాడు. భర్తతో పాటు అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి.
మరో మారు గొడవ..
ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. అరుణ్‌కుమార్ హింసించటం, కొట్టడం చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీవిద్య ఇంట్లో గొడవ జరుగుతున్న విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి, ఉయ్యూరులోని సమీప బంధువును ఆ ఇంటికి పంపించారు. శ్రీవిద్య విగతజీవిగా కనిపించింది. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ రామారావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీవిద్య భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అల్లుడే చంపాడు..
శ్రీ విద్య ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు తమ అల్లుడు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ రోధించారు. ఈ మేరకు పోలీసులకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులకు శ్రీవిద్య బలైనట్లు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు.
తమ్ముడూ.. రాఖీ కట్టలేనేమోరా!
శ్రీవిద్య సూసైడ్ నోట్ కలకలం సృష్టిస్తోంది. భర్త, అత్తమామలు సాధించిన తీరును ఆ లేఖ తేటతెల్లం చేసింది. ‘అమ్మా.. నాన్నా.. నాకింక బతకాలని లేదు. తాగి వచ్చి.. నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు. తన ప్రియురాలిలా అందంగా లేనంటూ హింసిస్తూ, కొడుతున్నాడు. భరించలేకపోతున్నాను. మీరంటే ఇష్టం. తమ్ముడూ.. నీకు రాఖీ కట్టలేకపోవచ్చేమో? అమ్మా, నాన్నను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ శ్రీవిద్య రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో పనిచేసే సహచరులు, కుటుంబ సభ్యులు ఆ లేఖను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
వరకట్న వేధింపులకు నవ వధువు బలి