
విజయవాడ నుంచి కాదు.. ఇక కాకినాడ నుంచి!
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): అధిక లాభాలు తెచ్చే బస్సు సర్వీసును వేరే డిపోకు బదలాయింపు చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారులపై ప్రయాణికులతోపాటు సంస్థ కార్మికులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. 15 ఏళ్లుగా విజయవాడ ఆటోనగర్ డిపో నుంచి చైన్నెకు రోజూ రెండు సర్వీసులు నడుపుతున్నారు. ఈ బస్సులకు మంచి ఆదాయమే వస్తోంది. వారం క్రితం కాకినాడలో జరిగిన ఓ సమావేశంలో అక్కడి ప్రజలు చైన్నెకు బస్సు సర్వీసు నడపాలని రవాణాశాఖ మంత్రిని కోరారు. దీనికి ఆ మంత్రి స్పందించి కాకినాడ నుంచి చైన్నెకి బస్సులు నడపాలని ఆర్టీసీ ఆర్‌ఎంతో పాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఆటోనగర్ డిపో నుంచి నడుస్తున్న చైన్నె బస్సు సర్వీసును ఇక్కడి నుంచి కాకినాడకు బదిలీ చేశారు.
ఇది సరికాదు: ఎన్‌ఎంయూ
ఈ నిర్ణయాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) నాయకులు విమర్శిస్తున్నారు. అవసరమైతే కాకినాడ – చైన్నెకు అదే డిపో నుంచి ఇంకొక సర్వీస్‌ను నడపాలని సూచించారు. ఎన్‌ఎంయూ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆర్‌ఎం దానంకు ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. రోజు ఉదయం 6.30 గంటలకు 3727 సర్వీసు నంబరు బస్సు, సాయంత్రం 7.30 గంటలకు 4060 సర్వీసు నంబరు బస్సు చైన్నెకి రాకపోకలు సాగిస్తున్నాయి. సాయంత్రం వెళ్లే బస్‌ను కాకినాడ డిపోకు బదిలీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు చైన్నె సమీపంలోని గుమ్మడిపూడి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. వారు ఈ బస్సు సర్వీసుల్లోనే తరచూ ప్రయాణిస్తుంటారు. తమకు సౌకర్యవంతంగా ఉన్న బస్సును కాకినాడకు బదిలీ చేయడంపై ఆ విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
15 ఏళ్ల చైన్నె బస్సు సర్వీసు
కాకినాడ తరలింపుపై కలకలం