
25 నుంచి శ్రావణ మాసోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసోత్సవాలకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ముస్తాబుకానుంది. ఈ నెల 25 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ‘శ్రావణ’ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రావణ మాసం రెండో వారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని దుర్గమ్మకు వరలక్ష్మీదేవిగా అలంకరణ, 5వ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేయనున్నారు. దేవస్థానంలో మూడు రోజులు పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లపై అధికారులు, సిబ్బంది, వైదిక పరమైన అంశాలతో వైదిక కమిటీతో ఈవో శీనానాయక్ సమావేశమయ్యారు. ఉత్సవ ఏర్పాట్లపై పలు ఆదేశాలు జారీ చేశారు.
శ్రావణ మాసం రెండో శుక్రవారం ఆగస్టు 8వ తేదీన దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించే వర లక్ష్మీవ్రతంలో భక్తులు రూ. 1500 టికెట్ కొనుగోలు చేసి పూజలో పాల్గొనవచ్చు. వ్రతం అనంతరం భక్తులను రూ. 300 టికెట్ లైన్‌లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. 5వ శుక్రవారం ఆగస్టు 22వ తేదీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఏర్పాట్లు చేయ నున్నారు. ఈ వ్రతాలకు రెండు, మూడు రోజుల ముందు దేవస్థానంలో భక్తులకు అప్లికేషన్లు అందజేస్తారు.
8 నుంచి పవిత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 8వ తేదీ నుంచి శ్రావణ శుద్ధ చతుర్ధశి శుక్రవారం ఆగస్టు 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి, 8వ తేదీ ఉదయం సుప్రభాత సేవ, అనంతరం స్నపనాభిషేకం, నిత్య ఆలంకరణ, పూజా కార్యక్రమాల తర్వాత అమ్మ వారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులకు పవిత్ర మాలధారణ జరుగుతుంది. 10వ తేదీ పూర్ణాహుతి, కలశోద్వాసన, మహాదాశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
మూడు రోజులు సేవలు నిలిపివేత
పవిత్రోత్సవాల నేపథ్యంలో వచ్చే నెల 8 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలుపు చేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. 11వ తేదీ నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు జరిగే అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా జరుగుతాయి.
16న కృష్ణాష్టమి వేడుకలు
దుర్గమ్మ సన్నిధిలో ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు. శనివారం ఉదయం కృష్ణుడికి ప్రత్యేక పూజలు, సాయంత్రం 5 గంటలకు మహా మండపం కళావేదికపై పురాణ పండితులతో ఉపన్యాసం, సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇంద్రకీలాద్రిపై 8న వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ 8 నుంచి 3 రోజులు పవిత్రోత్సవాలు ఆగస్టు 22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు