ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటాలి

Jul 18 2025 4:54 AM | Updated on Jul 18 2025 4:54 AM

ఉత్తమ

ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటాలి

జి.కొండూరు: ఐఐటీ, నీట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించి గురుకుల పాఠశాలల సత్తా చాటాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. జి.కొండూరు మండల పరిధిలోని కుంటముక్కల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్‌ లక్ష్మీశ గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలతో పాటు తరగతి గదులు, కిచెన్‌, డైనింగ్‌ హాలు, స్టోర్‌ రూమ్‌ను పరిశీలించారు. బియ్యం, కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఈ, నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో వసతుల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాల పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. బాలికల భద్రతకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సిబ్బందికి చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారిని పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో నియమించారు. వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర నారాయణ, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రుద్రపాటి తేజ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

సికిల్‌సెల్‌ ఎనీమియా సర్వే సక్రమంగా చేయండి

లబ్బీపేట(విజయవాడతూర్పు): సికిల్‌సెల్‌ ఎనీమియా సర్వేను సక్రమంగా చేయాలని, ప్రతి రోగిని గుర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఇళ్ల వద్ద ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి, పీఎం జేఏవై పథకం ఆవశ్యకతను వివరించారు. కంచికచర్లలోని సొసైటీ బజారులో ప్రతి ఇంటికీ వెళ్లారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ప్రసవాలు పెంచాలని వైద్యుడు, సిబ్బందిని ఆదేశించారు. కార్య క్రమంలో ఎపిడిమియాలజిస్ట్‌ డాక్టర్‌ స్నేహసమీర, డాక్టర్‌ బీవీ వసుంధర, సూపర్‌వైజర్‌ జీవీ రాఘవేంద్రరావు, ఎన్‌. శివప్రసాద్‌, రాణి, రోజా తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్‌ స్కూల్‌ కోర్సులను వినియోగించుకోండి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఓపెన్‌ స్కూల్‌ సేవలను అర్హులైన వారు వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గురువారం ఓపెన్‌ స్కూల్‌ కోర్సులపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లు పైబడిన వారు, చదువు మధ్యలో మానివేసిన వారు, అక్షర జ్ఞానం కలిగిన వారు ఓపెన్‌ స్కూల్‌తో విద్యాభ్యాసం పొందవచ్చన్నారు. 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు దూరవిద్య ద్వారా రాయవచ్చని పేర్కొన్నారు. సార్వత్రిక విద్యాపీఠం స్థానికంగానే పరీక్ష కేంద్రం కేటాయిస్తుందని తెలిపారు. పది, ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్‌ అయిన వారికి కూడా ఓపెన్‌ స్కూల్‌లో అవకాశం ఉందన్నారు. పదవ తరగతి ఏవైనా ఐదు సబ్జెక్టులతో కోర్సు పూర్తి చేయవచ్చని తెలిపారు. అన్ని వర్గాలకు ఓపెన్‌ స్కూల్‌ మంచి అవకాశమన్నారు. ఓపెన్‌ స్కూల్లో చేరి విద్యాభ్యాసం చేయాలనుకున్నవారు స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా మండల విద్యాశాఖ అధికారులు లేదా జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌లను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఓపెన్‌ స్కూల్‌ ప్రచారాన్ని ఆయన ఆ విభాగ అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఉత్తమ ర్యాంకులు  సాధించి సత్తా చాటాలి 
1
1/1

ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement