
బీసీల రాజ్యమంటూనే బీసీ మహిళపై దాడులా?
పెడన: బీసీల రాజ్యమంటూనే బీసీ మహిళలపై దాడులా.. ఇది ప్రజాస్వామ్యమా.. ఆటవిక రాజ్యమా అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. ఉమ్మడి కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము దంపతులపై కూటమి గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్ద, మహాత్ముని పాదాల వద్ద వినతిపత్రాలను ఉంచి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.
ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ హారిక, రాము దంపతులపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెడన ఎంపీపీ రాజులపాటి వాణి, జెడ్పీటీసీ మైలారత్నకుమారి, పెడన మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ చారుమతి, మహిళా నాయకులు వన్నం శ్రీలత, పాముపుష్ప, బొడ్డు శ్యామల, జ్యోతి, బేగం, రెహతున్నీసా, గుడిసేవ లక్ష్మీరాణి, ఎంపీపీలు సంగా మధుసూదనరావు, వెలివెల చినబాబు, జెడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇది ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా? న్యాయం జరగకపోతే పోరాటం మరింత తీవ్రతరం వైఎస్సార్ సీపీ శ్రేణులు పెడనలో కొవ్వొత్తుల ర్యాలీ

బీసీల రాజ్యమంటూనే బీసీ మహిళపై దాడులా?