
ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, గురుకుల వసతి గృహాల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 34 ఎస్సీ వసతి గృహాల్లో 2218 మంది విద్యార్థులు, 26 బీసీ వసతి గృహల్లో 1259మంది, మూడు ఎస్టీ వసతి గృహాల్లో 341 మంది, రెండు మైనార్టీ సంక్షేమ వసతి గృహలలో 64 మంది విద్యార్థులు ఉంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ వసతిగృహాల సంక్షేమ అధికారులపై ఆధారపడి ఉంటుందన్నారు. సంక్షేమ అధికారులు విద్యార్థులకు తల్లిదండ్రులతో సమానమని, వారికి మెరుగైన వసతితోపాటు విద్యను అందించాలని సూచించారు. దోమ తెరలను తప్పక ఏర్పాటు చేసుకోవాలని, హాస్టల్ మరమ్మతులకు సంబంధించి తగు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఆలసత్వం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జి.మహేశ్వరరావు, మైనార్టి సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, వెనకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ అధికారిణి ఎ.విజయశాంతి, గురుకుల విద్యాలయ సంక్షేమ అధికారి మురళీకృష్ణ, సహాయ సంక్షేమ అధికారులు వి.గణేష్, టి.గాయత్రి, ఎం.విజయ తదితరులు పాల్గొన్నారు.