
ఫసల్ బీమాను సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంట బీమా(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఆయా పంటల బీమా పథకాలపై వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో దిగుబడి ఆధారిత పీఎంఎఫ్‌బీవై కింద వరి, ఎర్ర మిరప, మొక్కజొన్న, పెసర పంటలను, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద పత్తి పంటను నోటిఫై చేసినట్లు చెప్పారు. వరికి గ్రామాన్ని, ఎర్ర మిరపకు మండలాన్ని, మొక్కజొన్న, పెసర పంటలకు జిల్లాను బీమా యూనిట్లుగా నోటిఫై చేసినట్లు వివరించారు. పీఎంఎఫ్‌బీవై అమలుకు టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ అమలుకు ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేశామన్నారు. రైతులు, కౌలురైతులు ఈ పథకాల్లో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి పంట రుణం పొందిన రైతులకు రుణంతోపాటు విజ్ఞప్తి మేరకు బీమా ప్రీమియం కూడా మంజూరు చేస్తారన్నారు. పంట రుణం తీసుకోని రైతులు కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ), బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించి జాతీయ పంట బీమా పోర్టల్ (ఎస్‌సీఐపీ)లో నమోదు చేసుకొని ఈ పథకంలో చేరవచ్చన్నారు. గ్రామ సచివాలయం, తపాలా కార్యాలయాలు కూడా సీఎస్‌సీగా పనిచేస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ–కేవైసీ నమోదు తప్పనిసరి..
రైతులు బీమా పరిహారం పొందాలంటే ఈ–పంట నమోదు, ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి వ్యవసాయ, ఉద్యాన అధికారులు, సిబ్బంది రైతులు పంట బీమా పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారికి మార్గనిర్దేశనం చేయాలని ఆదేశించారు. వరికి ఎకరాకు రూ. 42,500 పంట బీమా మొత్తం కాగా, ప్రీమియం కింద రూ.850 చెల్లించాలన్నారు. రైతులు ఆగస్టు 15వ తేదీలోగా బీమా చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజకుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీకుమార్ తదితరులు పాల్గొన్నారు.